కలం, కరీంనగర్ : జపాన్లోని ఐచి-నగోయా వేదికగా జరిగిన 20వ ఏషియన్ గేమ్స్ 2026 ఆర్చరీ విభాగంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన కరీంనగర్ ముద్దుబిడ్డ తనిపర్తి చికిత రావును (Chikitha Rao) బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) ఘనంగా సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. అంతర్జాతీయ వేదికపై భారత్ కీర్తి పతాకాన్ని ఎగురవేసి, కరీంనగర్ జిల్లాకే కాకుండా మొత్తం దేశానికి చికిత రావు ఎంతో గర్వకారణంగా నిలిచారని అభినందించారు. విలువిద్య విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాలు సాధించడం వెనుక ఆమె కఠిన శ్రమ, పట్టుదల ఎంతగానో ఉన్నాయని కొనియాడారు.
భవిష్యత్తులో ఆమె ఒలింపిక్ వంటి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి మన దేశానికి, రాష్ట్రానికి మహోన్నత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, ఆమెకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మనాయక వెలమ సంఘం నాయకులు, ప్రతినిధులు, తదితరులు పాల్గొని క్రీడాకారిణి చికిత రావుకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

