కలం, నల్లగొండ బ్యూరో: ఎల్ నినో దెబ్బతో గ్రామాల్లో సీతాఫలాలను (Custard Apple) వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్ గడుస్తున్నా గుట్టలు, పొలం గట్ల వెంట చెట్లకు పూతా.. కాతా లేదు. పిందె దశకు కూడా చేరుకోకపోవడంతో దీనిపై ఆధారపడిన పేద కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. సీతాఫలం ఎలాంటి రసాయనాలు, ఎరువులు లేకుండా వర్షధారంపై ఆధారపడి పండే పంట. ఈసారి వర్షపాతం సరిగా నమోదు కాకపోవడం, ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వ్యవసాయ బావులు, వాగులు, వంకల వెంట ఉన్న సీతాఫలాల చెట్లకు సైతం నీరు లభించక ఎండిపోయే దశకు చేరాయి. ఎండల తీవ్రతతో చెట్లకు పూత నిలవకపోవడం, వచ్చిన కొద్దిపాటి పూత కూడా రాలిపోవడంతో మోడుగా మారాయి. కొందరు రైతులు ఆధునిక పద్ధతుల్లో తోటలు సాగు చేసినా నీటి ఎద్దడితో దిగుబడి తగ్గిపోయింది.
హైవేల వెంట కన్పించని సందడి
ఏటా సెప్టెంబర్ ఆఖరు నుంచి నవంబర్ చివరి వరకు జాతీయ రహదారుల వెంట సీతాఫలాల అమ్మకాలతో సందడిగా మారుతాయి. ఉమ్మడి నల్లగొండ, యాదాద్రి జిల్లాల పరిధి ఆలేరు, యాదగిరిగుట్ట, మునుగోడు, తుంగతుర్తి, మోత్కూరు, సంస్థాన్ నారాయణపురం, మాల్, దేవరకొండ, చౌటుప్పల్, చిట్యాల, రామన్నపేట, వలిగొండ తదితర ప్రాంతాల్లోని గుట్టల్లో సీతాఫలాలు అధికంగా లభించేవి. ప్రతిరోజూ ఉదయమే బస్సులు, ఆటోల్లో వందలాది మంది బుట్టల్లో సీతాఫలాలను నింపుకుని హైదరాబాద్ జంట నగరాలలోని మార్కెట్లకు తరలించేవారు. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్, నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారుల వెంట అమ్మకానికి పెట్టేవారు. ఈసారి దిగుబడి లేకపోవడంతో అమ్మేవారు కనిపించకపోవడంతో ఆయా రోడ్లన్నీ బోసిపోయాయి.
కోల్పోయిన ఉపాధి
సీతాఫలాలు గ్రామీణ మహిళలు, గిరిజన కుటుంబాలకు సీజనల్గా లభించే జీవనోపాధి. రెండు మూడు నెలల పాటు పండ్లను సేకరించి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాలను వెళ్లదీసుకునేవారు. ఈ ఏడాది పండ్లు సరిగా లేకపోవడంతో ఉపాధి కోల్పోయారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో రైతులకు, కూలీలకు సీతాఫలాలు తినే అలవాటు ఉండగా.. ఈసారి చూద్దామన్నా ఒక్క పండు కూడా దొరకడం లేదు. వాతావరణ మార్పుల వల్లతో వచ్చిన ఎల్ నినో విపత్తు కారణంగా సీతాఫలాల పంటపై కూడా దెబ్బ పడింది.

