డిండి ప్రాజెక్టు పూర్తి చేయాలి.. సీపీఎం పోరుబాట

కలం, మునుగోడు: నల్లగొండ (Nalgonda) జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోతల పథకం (Dindi Project) పనులను ప్రభుత్వం వేగవంతం చేసి పూర్తి చేయాలని, ఏదుల జలాశయం నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని అందించాలని సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ డిమాండ్ చేశారు. సోమవారం చండూరు మండల కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో డిండి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలని కోరుతూ ఆర్డీవో శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధనంజయ మాట్లాడుతూ, ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలోని అనేక ప్రాంతాలకు సాగునీటి భరోసా లభిస్తుందని అన్నారు. పెండింగ్ పనులు, భూసేకరణ, అనుమతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

డిండి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి వరద జలాలను ఎత్తిపోసి సుమారు 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 30 టీఎంసీల నీటిని 60 రోజుల పాటు రోజుకు 0.50 టీఎంసీల చొప్పున తరలించేలా ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలోని మెట్ట ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని అన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలోని శివన్నగూడెం, కిష్టరాంపల్లి, సింగరాజుపల్లి, గొట్టిముక్కుల జలాశయాల పనులు దాదాపు పూర్తయ్యాయని, ప్రధాన కాలువ పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు.

మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటంతో ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధి బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధనంజయ ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటి ప్రభావం పంట పొలాలు, పండించిన ఆహార ధాన్యాలపై కూడా పడుతోందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డిండి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయాలని, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల ప్రజలకు రక్షిత తాగునీరు, సాగునీరు అందించి ఫ్లోరోసిస్ సమస్య నుంచి విముక్తి కల్పించాలని కోరారు. డిండి ఎత్తిపోతల పథకం పూర్తయ్యే వరకు జరిగే పోరాటాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, సీపీఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, సీఐటీయూ నాయకులు ఆంజనేయులు, సుమన్, సురేష్, శివ, లక్ష్మణ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>