కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) నగరంలోని వివేకానంద డిగ్రీ కళాశాల, హుజూరాబాద్‌లోని కిట్స్ (KITS) ఇంజనీరింగ్ కళాశాలల్లో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న అసిస్టెంట్ సైంటిస్ట్, అనలిస్ట్ గ్రేడ్-II ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను శనివారం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత కల్పించామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 144 అమలు చేస్తూ సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించినట్లు వెల్లడించారు. సీసీ కెమెరాల నిఘా, బయోమెట్రిక్ విధానం, అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో పోలీస్ అధికారులు, కేంద్రాల సమన్వయకర్తలు పాల్గొన్నారు.

