కలం, జోగులాంబ గద్వాల: ఎల్నినో ప్రభావంతో (El Nino Effect) వర్షాలు తక్కువగా కురిసినందున రబీ సీజన్లో రైతులు తమ బోర్లు, బావుల్లో అందుబాటులో ఉన్న నీటిని అంచనా వేసుకుని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Collector Rizwan Basha Shaik) సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి వెబ్ఎక్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ ఫార్మర్ రిజిస్ట్రీ, డిజిటల్ క్రాప్ సర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు.
ఎక్కడైనా పంటలు ఎండిపోతే సమగ్ర నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపించాలని, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీబీజీ రాంజీ పథకం కింద జల సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పంట కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై సర్పంచులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. ఈ నెల 30లోగా పనుల నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రైతు కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సమస్యలపై దృష్టి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట బోర్ల రీఛార్జ్, మోటార్ల మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. గొర్రెలు, మేకల బీమా పథకాలపై పశుపోషకులకు అవగాహన కల్పించాలన్నారు. ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు లేని పిల్లల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. గురుకులాలు, కేజీబీవీలు, వసతిగృహాల్లో విద్యార్థుల భద్రత, ఆహార నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శులు ప్రతి మంగళవారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలన్నారు. భూముల రీసర్వే పనులు వేగవంతం చేయడంతో పాటు లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో మంజుల, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

