SIR నోటీసుల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ ప్రియాంక

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న నోటీసుల పరిష్కారంతో (SIR Notice Resolution) పాటు ఫారం-6, 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) పి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పురోగతి, ఫారం-6, 7, 8 దరఖాస్తుల పెండింగ్, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న నోటీసులను త్వరితగతిన పరిష్కరించాలని, ఫారం-6, 7, 8 దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాల పరిశీలనను వేగవంతం చేయాలని ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ప్రియాంక జిల్లా అధికారులతో మాట్లాడుతూ..జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫారం-6, 7, 8 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాల ధ్రువీకరణను వేగవంతం చేయాలని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా అనామలీస్‌కు సంబంధించి జారీ చేసిన నోటీసుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

నోటీసుల పరిష్కార సమయంలో ఆధార్ కార్డుతో పాటు మరో గుర్తింపు పత్రాన్ని కూడా స్వీకరించి, సంబంధిత వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు. అక్టోబర్ 25వ తేదీలోగా ఎస్‌ఐఆర్‌ నోటీసుల పరిష్కార ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీ సెక్షన్ అధికారిని జయసుధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>