కలం, వెబ్ డెస్క్: తరచిచూడాలే కానీ.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సందరమైన ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలున్నాయి. వాటర్ ఫాల్స్, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఖల్లా ప్రాంతాలు లాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకే తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని ఐదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో రోప్వేల (Ropeways) నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. యాదగిరిగుట్ట, నాగార్జునకొండ, పెద్దపల్లి జిల్లాలోని రామగిరి కోట, నల్గొండలోని హనుమాన్ హిల్, డిచ్పల్లిలోని ఖిల్లా రామాలయం ప్రాంతాలను ఈ ప్రాజెక్టుల కోసం ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్వతమాల పథకం కింద సుమారు రూ.1,230 కోట్ల అంచనా వ్యయంతో ఈ రోప్వే ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
ఈ రోప్వేలు అందుబాటులోకి వస్తే పర్యాటకులు ఆయా ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం కలగనుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోని పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. దీంతో పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటుస్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుంది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మరింత గుర్తింపు కూడా లభిస్తుంది.

