కలం, యాదగిరిగుట్ట : గ్రామీణ కుటుంబాల అవసరాలను గుర్తించి, మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో సమగ్ర గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Anuraag Jayanti) అధికారులను ఆదేశించారు. VPRP–GPDP ప్రణాళికల అమలుపై బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి, జీవనోపాధికి సంబంధించిన అవసరాలను గుర్తించి, గ్రామసభల ద్వారా ఆమోదం పొందాలని కలెక్టర్ (Anuraag Jayanti) సూచించారు. ఆమోదించిన ప్రతిపాదనలను గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలతో పాటు సంబంధిత శాఖల వార్షిక కార్యాచరణ ప్రణాళికల్లో అనుసంధానించాలని స్పష్టం చేశారు.
జిల్లాలో VPRP–GPDP ప్రణాళికల అమలు పురోగతి, పెండింగ్లో ఉన్న అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి శాఖ తన పరిధిలోని ప్రతిపాదనలను సమీక్షించి, ప్రభుత్వ పథకాలు, నిధులు, అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా వార్షిక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రణాళికల రూపకల్పన, గ్రామసభల ఆమోదం, ప్రతిపాదనల అనుసంధానంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, DRDO, జిల్లా సమాఖ్య అధ్యక్షులు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

