జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ.. ప్రవీణ్ కుమార్ ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట (Gambhiraopet) మండలంలో భూ వివాదాల వార్తలను ప్రచురించిన ‘ఏక్ ధమ్ న్యూస్’ జర్నలిస్టులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్రంగా ఖండించారు. కరీంనగర్‌లో బాధితులైన జర్నలిస్టులను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధితుల ఇళ్ల తలుపులు పగలగొట్టి అరెస్టు చేసిన పోలీసులు, కస్టడీలో వారి చేతులు విరిగేలా, కాళ్లకు తీవ్ర గాయాలయ్యేలా బాదారని ఆరోపించారు.

పోలీసుల అరెస్టులు, కస్టడీకి సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన ‘డీకే బసు’ మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ, వాటిని గాలికి వదిలేసి పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. జర్నలిస్టులు స్వయంగా కరీంనగర్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దారుణమని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో పోలీసుల చేతిలో కర్ల రాజేష్ మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ, ఇప్పుడు మరో దళిత జర్నలిస్టుపై థర్డ్ డిగ్రీ వాడటం ఆందోళనకరమని పేర్కొన్నారు.

ఈ దాడి ఘటనపై వెంటనే ప్రత్యేక విచారణ బృందంను ఏర్పాటు చేయాలని, సిఐడి విచారణకు ఆదేశించాలని కోరారు. దాడికి పాల్పడిన స్థానిక ఎస్ఐ ఎవరి ఆదేశాల మేరకు నడుచుకున్నారో, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఈ అరాచకంపై డిజిపి సి.వి. ఆనంద్ తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంకటి శేఖర్, ఊరుమల్ల విశ్వం, మేకల రవీందర్, మొలుమూరి చంద్రశేఖర్, దొబ్బెల ప్రేమ్, సంజీవ్, కల్లేపల్లి అరవింద్, మనోజ్, కిరణ్, వెంకటేష్, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>