నారాయణపేట‌లో నలుగురు ఎమ్మెల్యేలుగా చలామణి : రాజేందర్ రెడ్డి

కలం, నారాయణపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. రాష్ట్రంలో దోచుకొని దేశ రాజధానిలో ఇవ్వడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి (Rajender Reddy) ఆరోపించారు.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో అమలు చేయని హామీలపై ఎన్నికల గ్యారంటీ కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సుమారు అర కిలోమీటర్ మేర ఫ్లెక్సీ ప్రింట్ చేయించి ప్రదర్శన చేపట్టారు.

సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా కింద అందాల్సిన పెట్టుబడి సాయం తమ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పథకాన్ని పూర్తిగా తుంగలో తొక్కారని ఆరోపించారు. రైతు కూలీలకు, ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని హామీలు ఎటుపోయారని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. మహిళలకు 2500 పెన్షన్ ఇస్తామని చెప్పారన్నారు. విద్యార్థులకు పీజీ రీయింబర్స్​ మెంట్​ స్కాలర్‌షిప్ బకాయిలు ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లో భాగంగా ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ నేటికీ అందించలేదని ఆయన విమర్శించారు.

తమ ప్రభుత్వ హయాంలో నారాయణపేట నియోజకవర్గం మంజూరైన విద్యా సంబంధిత ఇన్సిట్యూషనల్లు.. అభివృద్ధి కార్యక్రమాలను కూడా మాయం చేశారని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. గడిచిన వెయ్యి రోజులలో నారాయణపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటో సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఒకరే ఎమ్మెల్యే ఉంటే నారాయణపేటకు మాత్రం అనధికారికంగా ముగ్గురు చలామణి అవుతున్నారని రాజేందర్​ రెడ్డి ఆరోపించారు.

ఎమ్మెల్యే పీఏ కూడా ఎమ్మెల్యే మాదిరిగానే కొనసాగుతూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన కలెక్టరేట్ నిర్మాణ పనులు ఇప్పటివరకు పూర్తి కాకపోవడం శోచనీయమని రాజేందర్ రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో భాగంగా ప్రధాన రోడ్డు వెంబడి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్ రెడ్డి, వేపురి రాములు, కౌన్సిలర్లు భరత్, కాకర్ల నారాయణమ్మ తో పాటు నియోజకవర్గంలో నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>