కలం, వెబ్ డెస్క్: బీజేపీ కురు వృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్.కే.అద్వానీ (LK Advani) అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన్ను శుక్రవారం రాత్రి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. పూర్తి స్థాయిలో చికిత్సకు సహకరిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పల్మనాలజీ విభాగంలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వివరించాయి. 98 ఏళ్ల అద్వానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వానీ 2002 నుంచి 2004 వరకు దేశ ఉప ప్రధానిగా సేవలు అందించారు. 1990లో ఆయన చేపట్టిన రామజన్మభూమి ఉద్యమంతో బీజేపీ దేశంలో మరింత బలోపేతమై ఈ రోజు అధికారాన్ని సుస్థిరం చేసే స్థాయికి ఎదిగింది. దేశానికి ఆయనకు అందించిన సేవలకు గుర్తుగా 2024లో కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది. వయోభారం కారణంగా కొన్నాళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.

