కలం, భైంసా: నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా (Bhainsa) మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు (Municipal Contractors) చేపట్టిన రిలే నిరాహార దీక్ష (Strike) శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. గతేడాది వినాయక చవితి, దుర్గామాత నవరాత్రులు, ధమ్మచక్ర పరివర్తన దివస్ పండుగల సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా పనులు చేపట్టామని, అయితే ఇప్పటివరకు వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందించినా స్పందన లేకపోవడంతో దీక్షకు దిగాల్సి వచ్చిందన్నారు. గతేడాది పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించిన తర్వాతే ఈ ఏడాది పండుగల పనులకు టెండర్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకుండా టెండర్లు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. తమకు రావాల్సిన బిల్లులు చెల్లించడంతోపాటు సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు.

