కలం, వెబ్ డెస్క్ : బెంగాల్ రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 294 స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ (TMC) 81 స్థానాల్లోనే గెలవగా.. 54 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తిరగబడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ చీలిక దిశగా కొనసాగుతుందని సమాచారం అందుతోంది. రెబల్ ఎమ్మెల్యేలు న్యూ తృణమూల్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.
కాగా, సంతకాల ఫోర్జరీ అంశంతో తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య వివాదం చెలరేగింది. పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ శోభన్‌దేవ్ ఛట్టోపాధ్యాయ్‌ను సమర్థిస్తూ రాసిన లేఖలో తమ సంతకాలు ఫోర్జరీ అయ్యాయని, దీనిపై విచారణ జరపాలని టీఎంసీ ఎమ్మెల్యేలు సందీప్ సాహా, రితబ్రత బెనర్జీ స్పీకర్ కు , ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో సదరు ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ బహిష్కరించింది. ఈ అంశంపై విచారణ ప్రారంభించిన పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు.. టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీని విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కోల్‌కతాలో రహస్యంగా భేటీ అయిన రెబల్ ఎమ్మెల్యేలు.. గుర్తు కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.

