కలం, జోగులాంబ గద్వాల: బతుకమ్మ (Bathukamma) పండుగను పురస్కరించుకుని గురువారం గద్వాల కలెక్టరేట్ (Gadwal Collectorate)లో వివిధ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు. అదనపు కలెక్టర్ నర్సింగారావు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని బతుకమ్మలకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. రెవెన్యూ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా సంక్షేమ శాఖలు అందంగా అలంకరించిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి.
బతుకమ్మ పాటలు పాడుతూ మహిళా ఉద్యోగులు, యువతులు, మహిళలు లయబద్ధంగా ఆటలాడుతూ ఎంతో ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. దాండియా, కోలాటాలతో బతుకమ్మ సంబురానికి వన్నె చేకూర్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయ పనివేళలు ముగిసినప్పటికీ ఉద్యోగినులు ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా ఎంతో హుషారుగా ఈ ఉత్సవంలో పాల్గొని బతుకమ్మ వేడుక ఔన్నత్యాన్ని చాటారు. ఉత్తమ అలంకరణతో కూడిన బతుకమ్మలను ఎంపిక చేసి, బహుమతులు అందజేశారు. ఈ ఉత్సవాల్లో రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు వారి సిబ్బంది, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

