కలం, కరీంనగర్ బ్యూరో: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శమీ పూజ ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి సమాజం సుభిక్షంగా ఉండాలని, వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రైతాంగానికి త్వరలోనే బాధలు తీరాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
అలాగే ఉద్యోగ, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు భరోసా లభించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని ఆకాంక్షించారు. ఒక శక్తివంతమైన సమాజం నిర్మితమయ్యేలా ప్రతి ఒక్కరికీ అమ్మవారు శక్తిని ప్రసాదించాలని, ప్రజలంతా సమాజ హితం కోసం సేవలందించాలని పిలుపునిచ్చారు. దేశాన్ని సైనికుడిలా అహర్నిశలు రక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎదురవుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలని బండి సంజయ్ ఆకాంక్షించారు.
స్వార్థ రాజకీయాల కోసం కుట్రలు పన్నుతూ దేశాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్న మూలకాలపై కఠినంగా వ్యవహరించేలా ప్రధానికి తగిన శక్తిని అందించాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దేవీ నవరాత్రుల్లో భవానీ దీక్షలు చేపట్టే వారి సంఖ్య విపరీతంగా పెరగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు వేలాది మంది దీక్షలు స్వీకరించడం అత్యంత శుభపరిణామమని చెప్పారు. కరీంనగర్ మహాశక్తి ఆలయానికి వేలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ ధార్మిక వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా, విజయవంతంగా ముగిశాయని వెల్లడించారు.

