కలం, స్పోర్ట్స్: కొత్తగా జట్టుకట్టిన ఆస్ట్రియా జోడీ అదరగొట్టింది. షాంఘై మాస్టర్స్ (Shanghai Masters) డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. లూకాస్ మిడ్లర్, నీల్ ఒబెర్లైట్నర్ ఆదివారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్సిస్కో కాబ్రాల్, జేజే ట్రేసీపై 6-3, 6-4తో విజయం సాధించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల్లోనూ ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ గెలిచారు. షాంఘైలోని కిజాంగ్ ఫారెస్ట్ స్పోర్ట్స్ సిటీ అరేనాలో జరిగిన ఫైనల్ కేవలం 66 నిమిషాల్లో ముగిసింది. రెండు సెట్లలోనూ ప్రత్యర్థుల సర్వీస్‌ను ఒక్కోసారి బ్రేక్ చేసిన మిడ్లర్, ఒబెర్లైట్నర్ విజయాన్ని ఖాయం చేసుకున్నారు. తమ తొలి సర్వీస్ పాయింట్లలో 96 శాతం గెలుచుకున్నారు. ప్రత్యర్థులకు ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వలేదు.
ఈ విజయంతో మాస్టర్స్ 1000 సిరీస్‌లో టైటిల్ గెలిచిన తొలి ఆస్ట్రియా జోడీగా చరిత్ర సృష్టించారు. టోక్యోలో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ జంట, కలిసి ఆడిన రెండో టోర్నీలోనే ఇంతటి విజయాన్ని అందుకుంది. ఈ స్థాయి టైటిల్‌ను ఇంత త్వరగా గెలుస్తామని ఊహించలేదని 30 ఏళ్ల మిడ్లర్ పేర్కొన్నారు. తమ ఆటతీర్లు ఒకరికొకరు సరిపోతాయని భావించామని, అది ఇలా ఫలించడం ఆనందంగా ఉందని తెలిపారు. మిడ్లర్కు ఇది తన కెరీర్లో 14వ ఏటీపీ డబుల్స్ టైటిల్.
మరోవైపు, 27 ఏళ్ల ఒబెర్లైట్నర్కు ఇది రెండో టూర్ స్థాయి డబుల్స్ టైటిల్. ఆగస్టులో విన్స్టన్-సేలమ్ టోర్నీలో పెట్ర్ నౌజాతో కలిసి ఆయన తొలి టైటిల్ గెలిచారు. ఇప్పుడు షాంఘైలో మాస్టర్స్ 1000 టైటిల్ సాధించారు. ఈ విజయం తన సామర్థ్యాన్ని పెద్ద వేదికపై నిరూపించుకునే అవకాశం ఇచ్చిందని ఒబెర్లైట్నర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఆటను మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడతామని తెలిపారు.

