కలం, అశ్వారావు పేట: సోషల్ మీడియా రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అశ్వారావుపేట యువకులు విష్ణు, బబ్లు తదితరులకు అరుదైన గౌరవం లభించింది. గురువారం సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి ఇన్ఫ్లుయెన్సర్లతో (Aswaraopeta Social Media Influencers) నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ‘Aswaraopeta_guru’ పేజీ నిర్వాహకుడు విష్ణు పాల్గొని, ఎమ్మెల్యే చేతుల మీదుగా చిరు సన్మానం అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి (MLA Matta Ragamayee) సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సరదాగా ముచ్చటిస్తూ.. వారి అనుభవాలను తెలుసుకున్నారు. సోషల్ మీడియా రంగంలో ఎదురయ్యే ఇబ్బందులకు ఎవరూ నిరాశ చెందవద్దని, నిరుత్సాహపడకుండా తమ లక్ష్యాల దిశగా ముందుకు సాగాలని ఆమె ప్రోత్సహించారు. తాను సైతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నానని వివరిస్తూ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.
విష్ణు మాట్లాడుతూ.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించి, వారిని ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని ఎమ్మెల్యేను కోరుతూ, ఇన్ఫ్లుయెన్సర్లకు గుర్తింపు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేటకు చెందిన Aswaraopeta_guru విష్ణు, Aswaraopeta118 బబ్లూ, Aswaraopeta_updates గణేష్, Aswaraopeta_info శివ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు దమ్మపేట, సత్తుపల్లి, గంగారం, బేతుపల్లి, మర్లపాడు, సీతానగరం, తల్లాడ తదితర ప్రాంతాలకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు హాజరయ్యారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్న యువతను గుర్తించి, వారికి ప్రోత్సాహం అందించిన ఈ ఆత్మీయ సమావేశం ఇన్ఫ్లుయెన్సర్లలో నూతన ఉత్సాహాన్ని నింపింది.

