కలం, మహబూబ్నగర్ బ్యూరో: నేషనల్ హెల్త్ స్కీమ్ కింద పని చేస్తున్న 78 విభాగాల ఉద్యోగుల (NHM Employees) గోస ప్రభుత్వాలకు పట్టదా అని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర కార్యదర్శి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఎం క్రమబద్ధీకరణ, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి జేఏసీ నేతృత్వంలో నిరవధిక సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని సమ్మె శిబిరాన్ని ఏఐటీయూసీ నేతలు సందర్శించి ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఉద్యోగ భద్రత క్రమబద్ధీకరణ లాంటి న్యాయమైన సమస్యలను తీర్చాలని అనేక దఫాలుగా ప్రభుత్వానికి అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. ఎన్హెచ్ఎం రంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడుస్తున్నాయని కేంద్రం అరవై శాతం వాటా రాష్ట్రం వాటా 40 శాతం అంటున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, గ్రాస్ శాలరీ 100 శాతం చెల్లించాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వేతనాలు పీఆర్సీ ద్వారా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దేవానంద్, ఎన్హెచ్ఎం జేఏసీ ఉద్యోగులు సునీల్, ప్రవీణ్ వెంకటేష్, నవీన్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

