కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. టెక్మాల్ మండలం షాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని దండువానికుంట తండాలో(Danduvanikunta Thanda) విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు ప్రాణాలు కోల్పోయాడు. తండాకు చెందిన రైతు ఇస్లావత్ అనిల్ (25) ట్రాన్స్ఫార్మర్ వద్ద పనులు చేసే నిమిత్తం అక్కడికి వెళ్లారు. అయితే, అక్కడే ఉన్న హెల్పర్ కిందనే ఉండి రైతు అనిల్తో నిచ్చెన వేయించి ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కించారు. అనిల్ ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో ఆయనకు తీవ్ర విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో రైతు అనిల్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
విద్యుత్ లైన్ను ఆఫ్ చేయకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేయించడం వల్లే రైతు అనిల్ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారుల ముందస్తు నిర్లక్ష్యమే ఈ ప్రాణనష్టానికి కారణమని మండిపడ్డారు.ఈ ప్రమాదంతో తీవ్ర మనోవేదనకు గురైన మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే ఉన్న హెల్పర్పై కుటుంబ సభ్యులు దాడికి దిగారు. రైతుతో ట్రాన్స్ఫార్మర్పైకి ఎక్కించి పనులు చేయించిన లైన్మెన్పై చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

