కలం, నల్లగొండ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో మరో కీలక అడుగుపడింది.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీలతో పాటు నల్లగొండ కార్పొరేషన్ మేయర్ (Nalgonda Mayor) స్థానానికి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో రాజకీయం రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రాజకీయ వేడి రాజుకుంది. జంప్ జిలానీలు, టికెట్ ఆశావాహులు.. ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. తాజాగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయం మరింతగా ఊపందుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10 మున్సిపాలిటీలు మహిళలకు కేటాయించగా, 2 స్థానాలు బీసీ మహిళకు, ఒకటి ఎస్సీ మహిళకు, మిగిలిన 7 స్థానాలు జనరల్ మహిళకు కేటాయించారు. మిగిలిన 7 మున్సిపాలిటీల్లో 6 జనరల్‌కు, ఒకటి ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. మరోవైపు ఆయా మున్సిపాలిటీల్లో వార్డు స్థానాలకు సైతం రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
తొలి మేయర్ పీఠం మహిళకే..
సుదీర్ఘ కాలం తర్వాత నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. దీంతో నల్లగొండ తొలి మేయర్ స్థానం ఎవరికి దక్కుతుందనే దానిపై గతకొద్దిరోజులుగా తీవ్ర చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. నల్లగొండ మేయర్ (Nalgonda Mayor) స్థానాన్ని బీసీలకు కేటాయించాలంటూ ఇటీవల పెద్దఎత్తున డిమాండ్ విన్పించింది. మరోవైపు నల్లగొండ జిల్లా కేంద్రంలో మేయర్ పీఠంపై కాంగ్రెస్ కీలక లీడర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ రిజర్వేషన్లు జనరల్ మహిళకు కావడంతో వారి సతీమణులను రంగంలోకి దించేందుకు వ్యుహాలు రచిస్తున్నారు. ఇదిలావుంటే.. నల్లగొండ మేయర్ స్థానం ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. దీంతో పీఠంపై పాగా వేసేందుకు పొత్తులు, ఎత్తులంటూ ఆయా పార్టీల లీడర్లు చర్చలు చేస్తున్నారు. అయితే మేయర్ పీఠం జనరల్ మహిళలకు ఖరారు కావడంతో కొంతమంది లీడర్లు వెనక్కి తగ్గే అవకాశాలు లేకపోలేదు. భారీగా ఖర్చు చేసి కార్పొరేటర్లుగా గెలుపొంది మేయర్ స్థానం లేకుండా చేతులు కాల్చుకోవడం కంటే సైలెంట్‌గా ఉంటే బెటర్ అనే వాదన విన్పిస్తోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రిజర్వేషన్లు ఇవే..
ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఒక మేయర్ స్థానంతో పాటు 17 మున్సిపాలిటీలకు శనివారం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అందులో నల్లగొండ(మేయర్)- జనరల్ మహిళ, మిర్యాలగూడ- జనరల్ మహిళ, దేవరకొండ- బీసీ(మహిళ), చండూరు- జనరల్, నందికొండ(నాగార్జునసాగర్)- ఎస్సీ జనరల్, హాలియా- జనరల్, చిట్యాల- జనరల్ మహిళ, నకిరేకల్- జనరల్, భువనగిరి- జనరల్ మహిళ, చౌటుప్పల్- జనరల్ మహిళ, భూదాన్‌పోచంపల్లి- జనరల్, మోత్కూరు- ఎస్సీ(మహిళ), ఆలేరు- బీసీ మహిళ, యాదగిరిగుట్ట- జనరల్ మహిళ, సూర్యాపేట- జనరల్, కోదాడ- జనరల్ మహిళ, హుజూర్‌నగర్- బీసీ జనరల్, నేరేడుచర్ల- జనరల్, తిరుమలగిరి- జనరల్ స్థానాలను కేటాయించారు.
Read Also: ప్రతీ మున్సిపల్ బాడీలో ట్రాన్స్ జెండర్… త్వరలో చట్టసవరణ కోసం ఆర్డినెన్స్
Follow Us On : WhatsApp


