కలం, వెబ్ డెస్క్ : ఆన్ లైన్ షాపింగ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మీషోలతో పాటు మరో ఐదు ఈ కామర్స్ సంస్థలకు భారీగా ఫైన్లు విధించింది కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA). ఎలాంటి పర్మిషన్లు లేకుండా చట్ట విరుద్ధంగా వాకీ–టాకీలను అమ్ముతున్నాయనే కారణంతో వీటిపై కేంద్రం సుమోటోగా చర్యలు తీసుకుంది. మొత్తం 13 ఈ కామర్స్ సంస్థలకు నోటీసులు ఇచ్చిన సీసీపీఏ (CCPA).. చివరకు 8 సంస్థలకు రూ.44లక్షల ఫైన్ వేసింది.
ఫైన్ ఎందుకంటే..?
446.0MHz నుంచి 446.2 MHz మధ్య ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లో పనిచేసే పర్సనల్ మొబైల్ రేడియోలు మాత్రమే లైసెన్స్ లేకపోయినా అమ్ముకోవచ్చు. అంతకు మించిన పరిమితితో పనిచేసే పర్సనల్ మొబైల్ రేడియోలకు కచ్చితంగా ఎక్విప్ మెంట్ టైప్ అప్రూవల్(ETA) నుంచి లైసెన్స్ తీసుకోవాలి. పైగా లైసెన్స్ కు సంబంధించిన వివరాలను ఈ ప్రొడక్ట్ కింద కచ్చితంగా వివరించాలి. కానీ 8 ఈ కామర్స్ సంస్థలు ఎలాంటి లైసెన్స్ లు తీసుకోకుండా.. రూల్స్ పాటించకుండా ఈ వాకిటాకీలను అమ్మేస్తున్నట్టు సీసీపీఏ గుర్తించింది. ఫ్లిప్ కార్ట్ లో లైసెన్స్ లేకుండానే 65, 931 వాకీటాకీలు అమ్మారు. అలాగే అమెజాన్ లో 2602 యూనిట్లు, మీషోలో 2,209 యూనిట్లు, జియో మార్ట్ లో 58 యూనిట్లు, మెటా సంస్థలో 710 యూనిట్లు చట్టవిరుద్ధంగా అమ్మినట్టు సీసీపీఏ గుర్తించింది. అందుకే వాటిపై ఈ విధంగా చర్యలు తీసుకుంది.
ఫైన్ ఏయే సంస్థలకు..?
అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మీషో, మెటా ప్లాట్ ఫామ్స్ (ఫేస్ బుక్ మార్కెట్ ప్లేస్) సంస్థలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఫైన్ విధించింది సీసీపీఏ. జియో మార్ట్, టాక్ ప్రో, మాస్క్ మ్యాన్ టాయ్స్, చిమియా ఈ కామర్స్ సంస్థలకు ఒక్కో దానికి రూ.1లక్ష చొప్పున ఫైన్ విధించారు. ఇందులో మీషో, మెటా, చిమియా, జియో మార్ట్, టాక్ ప్రో సంస్థలు ఫైన్ చెల్లించాలి. మిగతావి చెల్లించాలని అధికారులు ఆదేశించారు.


