ఖేలో ఇండియా ఏర్పాట్ల‌పై మంత్రి శ్రీహ‌రి స‌మీక్ష‌

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: దేశమంతటా తెలంగాణ పేరు మారుమ్రోగేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను (Khelo India Youth Games 2026) గొప్పగా నిర్వహించాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ. సోని బాలాదేవి తదితరులతో కలిసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి వాకటి శ్రీహరి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం గచ్చిబౌలి కమాండ్ కంట్రోల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కలెక్టర్ కార్యాలయం వి.సి. హాల్ నుండి హాజరయ్యారు.

ఖేలో ఇండియా పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం ఎంతో గర్వకారణమని, అన్ని స్థాయిలలో అధికారులు పరస్పర సమన్వయంతో ఈ పోటీలను ఘనంగా నిర్వహించి, భవిష్యత్తులో ఒలింపిక్స్ స్థాయి అంతర్జాతీయ పోటీల నిర్వహణకు ఖేలో ఇండియా పోటీలను వేదికగా మలచుకోవాలని హితవు పలికారు. పోటీలలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న టార్చ్ ర్యాలీని ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి జిల్లాలో విజయవంతంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రతి ఒక్కరికీ ఖేలో ఇండియా క్రీడా పోటీల గురించి తెలిసేలా కృషి చేయాలన్నారు. క్రీడా పోటీలు జరిగే వేదికలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వం ఇప్పటికే వారికి అందజేసిన స్పోర్ట్స్ యూనిఫాంలతో తరలించి వారు క్రీడలను తిలకించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల క్రీడల ప్రాముఖ్యతను విద్యార్థిని, విద్యార్థులు గుర్తెరిగి స్ఫూర్తి పొందుతారని అన్నారు. అదేవిధంగా యువతను, ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములు చేయాలని మంత్రి శ్రీహరి సూచించారు.

ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, క్రీడా సామగ్రి విషయంలో ఎంతమాత్రం రాజీ పడకూడదని, అదే సమయంలో క్రీడాకారులు, వారి వెంట వచ్చే సపోర్టింగ్ స్టాఫ్ భద్రత, వసతి, భోజనం ఇత్యాది సౌకర్యాల కల్పనలో లోటు ఉండకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్రీడా వేదికలను క్షేత్రస్థాయిలో సందర్శించి, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా సిద్ధం చేయాలని అన్నారు. యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్ ఖేలో ఇండియా పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, పోటీలు సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు అందరూ సమిష్టి కృషితో విజయవంతం చేయాలని అన్నారు.

యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ముఖ్య సాధనంగా మలుచుకోవాలనే ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఈ ఈవెంట్ ను పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. ప్రతి గురుకుల పాఠశాల, విద్యాసంస్థకు ఖేలో ఇండియా కార్యక్రమం గురించి తెలియజేయాలని, విద్యార్థులు, యువతను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేస్తూ టార్చ్‌ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ఈ ర్యాలీల ద్వారా క్రీడలపై అవగాహన కల్పించి, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. మధుసూదన్ నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైని సాయి శివాని, డి.ఆర్.ఓ ఎ.నిర్మల, డి. వై. ఎస్.ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>