నేరాల కట్టడిపై ఐజీ షాహనవాజ్ ఖాసీం ఫోకస్

కలం, నల్లగొండ : పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహించాలని మల్టీ జోన్-2 ఐజీ షాహనవాజ్ ఖాసీం (Shahnawaz Qasim) అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి డాగ్ స్క్వాడ్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్, డీపీఓ విభాగాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి శాంతిభద్రతలు, నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై చర్చించారు.

ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. ప్రజలతో సానుకూలంగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా విని భరోసా కల్పించాలని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమనే సూత్రంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని, గంజాయి సరఫరాదారులపై నిఘా ఉంచి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని ఆదేశించారు. యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పదేపదే నేరాలకు పాల్పడే వారిపై రౌడీషీట్లు తెరవాలని సూచించారు.

చైన్ స్నాచింగ్‌లు, ఇళ్ల దొంగతనాల నివారణకు నిరంతర పెట్రోలింగ్, నాకాబందీ నిర్వహించాలని, ముందస్తు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, అధికారులు గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని అన్నారు.

అనంతరం నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. కాగా, దొంగ నుంచి రికవరీ చేసిన బంగారంలో గోల్‌మాల్ జరిగినట్లు, అందులో అధికారుల పాత్రపై ఆరోపణలు వచ్చిన విషయం బహిరంగ రహస్యమే. రాజకీయ పలుకుబడితో చర్యలు తీసుకోకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీలు మల్లారెడ్డి, శివరాం రెడ్డి, శ్రీనివాసరావు, రవి, లక్ష్మీనారాయణ, ప్రొబేషనరీ డీఎస్పీలు సైలేష్, అఖిల్, ఎల్. శ్రీకాంత్, ఎం. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>