కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పోలీస్ ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష సందర్భంగా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, ప్రశాంతంగా, పారదర్శకంగా పరీక్ష నిర్వహించేందుకు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) ఆదేశించారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ మైదానంలో పరీక్ష బందోబస్తు విధులకు హాజరైన జిల్లా పోలీస్ అధికారులకు, ఇతర జిల్లాల నుంచి బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ విధి నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా, సమయపాలనతో నిర్వహించాలని, పరీక్షా కేంద్రాలకు కేటాయించిన సిబ్బంది ముందుగానే చేరుకుని విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల వద్ద అనధికార వ్యక్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలనీ,అభ్యర్థులను హాల్‌టికెట్, గుర్తింపు పత్రాల ఆధారంగా మాత్రమే అనుమతించాలన్నారు. పరీక్షా నిబంధనల అమలులో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ నిషేధాజ్ఞలు కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షించాలన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలు మూసివేయించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుని, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
పరీక్షా నిర్వహణ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని, ఏవైనా అనుమానాస్పద సంఘటనలు, మాల్‌ప్రాక్టీస్ ప్రయత్నాలు గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష ముగిసే వరకు బందోబస్తు సిబ్బంది తమ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించకూడదన్నారు. ఎస్సై నియామక పరీక్ష ఎంతో మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నందున, పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి పాటించాలని ఎస్పీ సూచించారు. పోలీస్ శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, సమన్వయంతో విధులు నిర్వహించి పరీక్షను విజయవంతం చేయాలని ఆదేశించారు.

