ప్రజా సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు: ఎంపీ గోడం నగేష్

కలం, నిర్మల్ : ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు నిబద్ధతతో పని చేయాలని అదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ (MP Godam Nagesh) అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దిశా కమిటీ (డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు.

విబిజి రామ్ జీ పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తూ, జాబ్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలని ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే పనులను వెంటనే ప్రారంభించి, గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. ఈ పథకం కింద ఉపాధి పనుల కల్పనలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినందుకు అధికారులను అభినందించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో అర్హులందరికీ చేయూత పింఛన్లు అందేలా చూడాలన్నారు.

మారుమూల గిరిజన ప్రాంతాల్లో మెరుగైన టెలికాం సేవల కోసం బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, స్థల కేటాయింపుతో పాటు పనుల్లో జాప్యం చేసే ఏజెన్సీలకు నోటీసులు ఇవ్వాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. బేటీ బచావో బేటీ పడావో, మిషన్ వాత్సల్య పథకాల ద్వారా చిన్నారుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.

పీఎంశ్రీ, సర్వ శిక్షా అభియాన్, పీఎం పోషణ్ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీ సూచించారు. కేంద్ర పథకాల నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులను సందర్శలకు తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను మెరుగుపరచాలని అన్నారు.

అమృత్ 2.0 కింద మున్సిపాలిటీలలో తాగునీటి ట్యాంకులు, పైప్‌లైన్ పనులను వేగవంతం చేయాలని, భైంసా మున్సిపాలిటీలో స్థల కేటాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, వెంకట మాధవ రావు, డీఆర్‌డీఓ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>