కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం (నవంబర్ 29) నిర్వహించనున్న తెలంగాణ పోలీస్ ఎస్సీటీ ఎస్సై సివిల్, సమాన స్థాయి పోస్టుల ప్రిలిమినరీ రాత పరీక్షల ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (Khammam CP Sunil Dutt) శనివారం పరిశీలించారు. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పీజీ కాలేజ్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కమిషనరేట్ పరిధిలోని మొత్తం 34 కేంద్రాల్లో పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ (Khammam CP) స్పష్టం చేశారు. అభ్యర్థులు, ప్రజలు ఈ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. పరీక్ష జరిగే సమయంలో కేంద్రాల పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ కేంద్రాలు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సీపీ ఆదేశించారు. ఈ తనిఖీల్లో టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

