మహబూబ్‌నగర్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) తెలిపారు. గత మూడేళ్లలో నగరంలో సుమారు రూ.1,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, భవిష్యత్తులో మహబూబ్‌నగర్‌తో పాటు జడ్చర్ల, భూత్పూర్ పట్టణాలను కలిపి ట్రై సిటీగా అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.1,200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, నాణ్యత, ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి ఆధ్వర్యంలో శనివారం మహబూబ్‌నగర్‌లోని ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన పట్టణ స్థితిస్థాపకత, భాగస్వాముల సంప్రదింపుల వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లతో కలిసి వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నగరంలో దీర్ఘకాలంగా నెలకొన్న తాగునీరు, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో భారీ ప్రాజెక్టులను చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఇందులో భాగంగా రూ.220 కోట్లతో తాగునీటి సరఫరా ప్రాజెక్టు, రూ.603 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు, రూ.100 కోట్లతో టీ-ఫైవ్ డీసీ పథకం కింద డ్రైన్లు, రోడ్ల అభివృద్ధి పనులు, రూ.267 కోట్లతో అమృత్ 2.0 పథకం కింద సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

గతంలో కాగితాలకే పరిమితమైన కొన్ని పనులను తిరిగి మంజూరు చేయించి క్షేత్రస్థాయిలో ప్రారంభించామని పేర్కొన్నారు. నగరాభివృద్ధికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని సమీక్షలో స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>