కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కు ప్రత్యేక స్థానం ఉందని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి దీక్షా దివస్ ప్రతీకగా నిలుస్తుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం అలుగునూరులో(Alugunur) నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. శనివారం సభా ప్రాంగణం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో గంగుల కమలాకర్‌తో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్ష
2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిందని గంగుల గుర్తుచేశారు. కరీంనగర్ నుంచి సిద్ధిపేటకు వెళ్తున్న కేసీఆర్‌ను అలుగునూరు వద్ద అరెస్టు చేయడంతో ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు, కవులు, కళాకారులు, మేధావులు ఉద్యమంలో భాగస్వాములయ్యారని, చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ దీక్ష చారిత్రాత్మక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు.
నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ సభ
దీక్షా దివస్ కేవలం బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సభ అని నాయకులు స్పష్టం చేశారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, విద్యార్థులు, యువత, ప్రజాసంఘాల ప్రతినిధులు సహా అన్ని వర్గాల ప్రజలు సభలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు రైతాంగం, సాగునీటి సమస్యలు, కరువు పరిస్థితులపై ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని విమర్శించారు. కాళేశ్వరం జలాల వినియోగం, రైతుల సమస్యలపై ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం
దీక్షా దివస్ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కరీంనగర్‌కు చేరుకోనున్న ఆయన, సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే సభలో పాల్గొంటారని నాయకులు తెలిపారు. ప్రజలు ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు.
35 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు
సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో సుమారు 35 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. మండలాల వారీగా వాహనాలకు పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక కమిటీలు, వాలంటీర్లను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజలకు మంచినీరు, కూర్చునే సదుపాయంతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించినట్లు నాయకులు వెల్లడించారు.
సభకు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపు
దీక్షా దివస్ సభపై ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోందని నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయడంతో పాటు రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల పరిరక్షణపై ప్రజలను చైతన్యపరిచే వేదికగా ఈ సభ నిలవాలని ఆకాంక్షించారు. కులమత, రాజకీయ భేదాలకు అతీతంగా తెలంగాణను ప్రేమించే ప్రతి ఒక్కరూ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

