కలం, ఖమ్మం బ్యూరో: ముంబై (ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్) నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (Konark Express) (రైలు నంబర్ 11019) లో ఓ యువతి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆ యువతి ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్లో ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పూనం ప్రతాప్ పాండా (18) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై బోగిలోనే కుప్పకూలిపోయింది.
తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. మధిర స్టేషన్లో రైలును నిలిపివేసి, 108 సిబ్బంది సాయంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, యువతిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కళ్లముందే ఎదిగిన కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు.

