డ్ర‌గ్స్ త‌యారు చేస్తే అమీర్‌పేట్‌లో పాత‌రేస్తా: కిష‌న్ రెడ్డి

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్‌లో 2029 త‌ర్వాత‌ డ్ర‌గ్స్ త‌యారు చేసినా, వినియోగించినా, అక్ర‌మంగా అమ్మ‌కాలు చేప‌ట్టినా అమీర్ పేట్ చౌర‌స్తాలో పాత‌రేస్తాన‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy) హెచ్చ‌రించారు. డ్ర‌గ్స్ నిర్మూల‌నే ల‌క్ష్యంగా కిష‌న్ రెడ్డి చేప‌ట్టిన న‌షాముక్త్ భార‌త్ పాద‌యాత్ర రెండో రోజు అమీర్‌పేట్‌లో ముగిసింది. ఈ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రూ న‌షాముక్త్ భార‌త్ వారియ‌ర్స్ గా మారాల‌న్నారు. డ్ర‌గ్స్ ఆప‌డం పోలీసులు, అధికారుల బాధ్య‌త మాత్ర‌మే కాద‌ని స్ప‌ష్టం చేశారు. డ్ర‌గ్స్ వ‌ల్ల కుటుంబాలు నాశ‌నం అవుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. డ్ర‌గ్స్ కు వ్య‌తిరేకంగా ప్ర‌తి ఒక్క‌రూ పోరాటం చేయాల‌ని పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో దేశం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ఈ యాత్ర చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. డ్ర‌గ్స్ వ్యసనం పంజాబ్‌లో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసి అభివృద్ధిని అడ్డుకుందని, మరే ఇతర రాష్ట్రానికి అలాంటి దుస్థితి రాకుండా చూడాల‌ని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన భారత్‌లో యువత మత్తుకు దూరంగా ఉండి, తల్లిదండ్రులు, గురువుల త్యాగాలను గౌరవించాల‌ని కోరారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం ఐటీ, వైద్యం, అంతరిక్ష సాంకేతికత రంగాల్లో రాణించాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి విద్యార్థి, కుటుంబం అప్రమత్తంగా ఉండి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ, అందరితో కలిసి సామూహిక ప్రతిజ్ఞ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>