కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు పోలీస్ కిష్టయ్య (Martyr Police Kishtayya) 17వ వర్ధంతి కార్యక్రమ పోస్టర్‌ను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గురువారం తన నివాసంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. డిసెంబర్ 1న నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ (Gangula Kamalakar) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీస్ కిష్టయ్య చేసిన ఆత్మబలిదానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తన కుటుంబం కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన మహనీయుడని కొనియాడారు. 1969, 1972లో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలు పునరావృతం కాకూడదనే సంకల్పంతోనే కిష్టయ్య ఆత్మబలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు. కిష్టయ్యతో పాటు శ్రీకాంతాచారి వంటి ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారని గుర్తుచేశారు. కిష్టయ్య కుటుంబానికి భూమి కేటాయించడంతో పాటు ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించారని తెలిపారు. వారి పిల్లల ఉన్నత చదువులకు కూడా కేసీఆర్ సహకారం అందించారని పేర్కొన్నారు. ఇటీవల కేటీఆర్ కరీంనగర్ పర్యటనకు వచ్చిన సందర్భంలో కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శించారని గుర్తుచేశారు.
అమరవీరుల కుటుంబాలను తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తామని, వారికి ఏ చిన్న కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని గంగుల స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను, వారి కుటుంబాల త్యాగాలను జీవితాంతం గుర్తుంచుకుంటామని తెలిపారు. డిసెంబర్ 1న నిర్వహించనున్న పోలీస్ కిష్టయ్య 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళులర్పించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు పండుగ బాలు ముదిరాజ్, కరీంనగర్ జిల్లా ముదిరాజ్ మహాసభ గౌరవ అధ్యక్షులు కొలక నర్సయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్, కొత్తపల్లి మండల అధ్యక్షులు శ్యామ్ ముదిరాజ్, హుస్నాబాద్ నియోజకవర్గ యువత ఇన్చార్జ్ మద్ది పవన్ ముదిరాజ్, భిక్షపతి ముదిరాజ్, గన్నేరువరం మండల అధ్యక్షులు మల్లేశం ముదిరాజ్, గుడెల్లుల పోచయ్య ముదిరాజ్, కంకటి రాజారాం ముదిరాజ్, కొత్తపల్లి మండల యువత అధ్యక్షులు శరత్ ముదిరాజ్, శ్రావణ్ ముదిరాజ్ తదితర ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.

