కలం, ఖమ్మం బ్యూరో: ఆడబిడ్డలు మురిపెంగా కట్టుకుని మెరిసిపోయేలా అత్యంత నాణ్యమైన చీరలను తయారు చేయించి, ఏటా ఒక కొత్త రంగు చీరను కోటి మంది మహిళలకు అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అన్నారు. గురువారం ఖమ్మంలోని శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తో కలిసి ఆయన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేటలోని నల్లమల అడవుల్లో ఈ బృహత్తర పథకాన్ని ప్రారంభించిన వెంటనే ఖమ్మం జిల్లాలోనూ పంపిణీ చేపట్టామన్నారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలు ధరించే విధంగా ఉండేవి కావని విమర్శించిన ఆయన, ప్రజా ప్రభుత్వం మాత్రం పేద మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా నాణ్యమైన చీరలను అందిస్తోందన్నారు.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో గత ఏడాది పాలపిట్ట రంగు చీరలు ఇవ్వగా, ఈ ఏడాది చిలకపచ్చ రంగు చీరలు పంపిణీ చేస్తున్నామని మంత్రి (Minister Tummala) వివరించారు. రాష్ట్రంలో నిధుల ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సంక్షేమ పాలనకు పెద్దపీట వేస్తున్నారని మంత్రి తెలిపారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల దరఖాస్తులన్నింటినీ ఆమోదించి, రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేడే పింఛన్ నగదును జమ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు కోరుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ పారస్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, మెప్మా పీడీ నళినీ పద్మావతి, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : తాజ్ మహల్పై వానరసేన దండయాత్ర.. వీడియో వైరల్!
Follow Us On: Youtube

