కలం, కరీంనగర్: తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమైన దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం తెలంగాణ చౌక్‌లో డప్పు చాటింపు కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) స్వయంగా డప్పు కొట్టి ప్రజలకు సభకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. గతంలో గ్రామాల్లో ముఖ్యమైన కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు డప్పు చాటింపు ప్రధాన సాధనంగా ఉండేదని గుర్తుచేశారు. అదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ దీక్షా దివస్ సభకు ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టం
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచిందని గంగుల పేర్కొన్నారు. కేసీఆర్ అరెస్టుతో ఉద్యమం మరింత ఉధృతమైందని, ప్రజా ఉద్యమం, నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు, ఉద్యమకారులు, కవులు, మేధావులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు.
29న అలుగునూరులో భారీ సభ
ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలకు అలుగునూరులో నిర్వహించనున్న సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని గంగుల తెలిపారు. సభలో అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, కవులు, మేధావులను సన్మానించనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

