కలం, కరీంనగర్ : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వెంటనే కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ఆదేశించారు. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి ధాన్యం విక్రయించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు ప్రక్రియ ఎలా సాగుతున్నది, ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి రావొద్దని సూచించారు. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

