రేష‌న్ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న డీల‌ర్‌పై చ‌ర్య‌లు

​కలం, ఖమ్మం బ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడుతూ పేదలకు చేరాల్సిన రేషన్ సరుకులను పక్కదారి పట్టిస్తున్న చౌకధరల దుకాణం డీలర్‌పై పౌరసరఫరాల శాఖ కొరడా ఝుళిపించింది. ఖమ్మం పట్టణంలోని చౌకధరల దుకాణం డీలర్ (Khammam Ration Dealer) రాజయ్యపై నిత్యావసర సరుకుల చట్టం-1955 ప్రకారం 6ఏ కేసు నమోదు చేసి, దుకాణంలోని 6.84 క్వింటాళ్ల రేషన్ సరుకులను అధికారులు శనివారం సీజ్ చేశారు. ​ఖమ్మం పట్టణంలోని 2281001 నంబర్ రేషన్ దుకాణంలో డీలర్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు వీడియో ఆధారాలతో కూడిన ఫిర్యాదు అందడంతో జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించారు.

ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌ఓ) చందన్ కుమార్‌ను ఆదేశించారు. ​కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎస్‌ఓ చందన్ కుమార్ సదరు దుకాణంలో స్వయంగా తనిఖీలు చేపట్టారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో డీలర్ ఎం. రాజయ్యపై 6ఏ కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన 6.84 క్వింటాళ్ల సరుకులను భద్రత నిమిత్తం సమీపంలోని 2281002 నంబర్ చౌకధరల దుకాణం డీలర్‌కు అప్పగించారు. ​ఈ సందర్భంగా డీఎస్‌ఓ చందన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థలో పూర్తి పారదర్శకతను కాపాడతామని, రేషన్ సరుకులను పక్కదారి పట్టించే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే ప్రజలు వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>