నదీ తీర ప్రాంతాల్లో నయా దందా.. వ్యాపారుల చేతుల్లోకి వేలాది ఎకరాలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: కొందరు అక్రమార్కులు నదీ తీర భూముల్లో నయా దందాకు (Illegal Land Auctions) తెరలేపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలోని కృష్ణా, తుంగభద్ర నదుల తీర ప్రాంతాల్లోని వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ భూముల్లో పంటలు పండించేందుకు అనధికారిక వేలంపాటలు నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల పెద్దలు, బడా వ్యాపారులు కుమ్మక్కయి ‘గ్రామ అభివృద్ధి కమిటీ’ల పేరుతో ఇదంతా చేస్తున్నారు. ఈ వేలంపాటల్లో వ్యాపారులూ పాల్గొంటూ వేలాది ఎకరాలను దక్కించుకొని స్థానిక రైతులతో సాగు చేయిస్తున్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా నదుల్లో నీళ్లు పారడం లేదు. దీంతో వేలాది ఎకరాల సారవంతమైన భూములు బయటపడ్డాయి. ఈ భూముల్లో పంటలు పండించి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో స్థానిక, స్థానికేతర వ్యాపారులు.. నదుల తీర ప్రాంత గ్రామాల పరిధిలో వేలంపాటలు నిర్వహిస్తున్నారు.

వ్యాపారుల చేతుల్లోకి..

ఈసారి ఎల్ నినో ప్రభావంతో నదుల్లో నీళ్లు లేకపోవడంతో తీర ప్రాంత భూములపై బడా వ్యాపారులు కన్నేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్, జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ ప్రాంతాలతో పాటు నారాయణపేట జిల్లా కృష్ణ మండలం నుంచి జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వరకు వేలాది ఎకరాల నదీ తీర భూములు ఉన్నాయి. నీరు తగ్గిన వెంటనే ఈ భూములు సాగుకు అత్యంత అనుకూలంగా మారుతాయి. దీంతో ఈ భూముల్లో పంటలను సాగు చేసి సొమ్ము చేసుకోవాలని కొందరు వ్యాపారస్తులు దందాకు తెరలేపారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రవహించే కృష్ణా, తుంగభద్ర నదుల తీర ప్రాంతాల్లోని వేలాది ఎకరాలు స్థానిక వ్యాపారుల చేతుల్లోకి వెళ్తున్నాయి.

లోపాయికారి ఒప్పందం

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో ఏకంగా రూ.3 కోట్ల రూపాయల వేలంపాటలు జరిగినట్లు తెలుస్తున్నది. గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యులు, వ్యాపారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నదీ తీర భూములపై ఎవరికీ ఎలాంటి పట్టాలు లేకపోయినా.. స్థానికంగా పలుకుబడి ఉన్న కొందరు వ్యక్తులు, దళారులు, వ్యాపారులు వీటిని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. గ్రామాభివృద్ధి కమిటీల పేరా లక్షల్లో వేలంపాటలు నిర్వహిస్తూ భూములను దక్కించుకుంటున్నారు. ఎకరాకు రూ. 10 వేల నుంచి రూ.50 వేల వరకు సీజన్ వారీగా వేలం వేస్తూ.. అత్యధిక ధర పాడిన రైతులకు లేదా బయటి వ్యక్తులకు సాగుకు అప్పగిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

నదీ తీర ప్రాంతంలోనే వ్యవసాయం చేస్తుండటంతో పంటలకు వాడే రసాయన ఎరువులు, పురుగుమందులు నేరుగా నదీ జలాల్లో కలుస్తున్నాయి. దీంతో తాగునీటి ప్రాజెక్టుల్లోని నీటి నాణ్యత దెబ్బతింటున్నది. వేలంపాటలు, సరిహద్దుల విషయంలో గ్రామాల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ అనధికారిక వేలంపాటలు, భూముల ఆక్రమణలను అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నదీ తీర ప్రాంతాలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు సరిహద్దులను గుర్తించి ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం ఉన్నది. లేదంటే నిబంధనలకు లోబడి స్థానిక నిరుపేద రైతులు లేదా మత్స్యకారులకు మాత్రమే ప్రభుత్వమే నామమాత్రపు రుసుముతో సీజనల్ సాగుకు అనుమతులు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తున్నది.

పెట్టుబడి వ్యాపారులది.. పని చేసేది రైతులు

ఈ సారవంతమైన ఒండ్రు నేలల్లో ప్రధానంగా పుచ్చకాయ, కర్బూజ, మిరప, వేరుశనగ, శనగ, పత్తి తదితర వ్యాపార పంటలతో పాటు కూరగాయలు వంటి స్వల్పకాలిక, అధిక ఆదాయం ఇచ్చే పంటలను సైతం సాగు చేస్తున్నారు. పెట్టుబడి అంతా వ్యాపారులు పెట్టి.. స్థానిక రైతులను కౌలుదారులుగా వాడుకుంటూ లాభాలను దండుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పండ్లు, కూరగాయల వ్యాపారులు ముందే ఈ భూములను వేలంలో దక్కించుకుని.. స్థానిక రైతులు, కూలీలతో సాగు చేయిస్తున్నారు. సొంత భూములు లేని చిన్న, సన్న కారు రైతులు, స్థానిక మత్స్యకారులు ఉపాధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులు నిర్వహించే ఈ వేలంపాటల్లో పాల్గొంటున్నారు. మరోవైపు నీటి ఎద్దడి కారణంగా కొన్ని గ్రామాల్లో రైతులు చెరువు నీటిని సైతం వేలం వేసుకుని పంటలను కాపాడుకోవాల్సిన దుస్థితి నెలకొంటున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>