కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదంపై మాజీ ఓపెనర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ (Cameron Bancroft) ఎనిమిదేళ్ల తర్వాత సంచలన నిజాలు బయటపెట్టారు. బంతిపై శాండ్‌పేపర్ వాడుతున్న విషయం జట్టులోని అందరికీ తెలుసని, కానీ తనను కావాలనే బలిపశువును చేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ‘ది వెస్ట్ ఆస్ట్రేలియన్’ పత్రికలో ఆయన రాసిన కాలమ్ తీవ్ర చర్చనీయాంశమైంది. గత వారం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలే తనను నిజం చెప్పేలా ప్రేరేపించాయని బాన్‌క్రాఫ్ట్ పేర్కొన్నారు. శాండ్‌పేపర్ విషయం తనకు అసలు తెలియదని కమిన్స్ చెప్పడం తనకు కోపం తెప్పించిందని చెప్పారు.
అసంపూర్ణ నిజాలను ఇకపై దాచలేనని భావించి మౌనం వీడినట్లు స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా పర్యటనలో డర్బన్ టెస్టు విజయం తర్వాత జట్టులో అహంకారం పెరిగిందని, రెండో టెస్టుకు ముందే రివర్స్ స్వింగ్ కోసం శాండ్‌పేపర్ వాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. హెడ్ కోచ్ డారెన్ లీమన్, బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్ సమక్షంలోనే ఈ చర్చలు జరిగాయని ఆరోపించారు. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ మార్ష్, టిమ్ పైన్‌లతో తాను నిరంతరం బంతి పనితీరు గురించి చర్చించానని, తాను శాండ్‌పేపర్ వాడుతున్న విషయం వారందరికీ తెలుసని వెల్లడించారు.
కేప్‌టౌన్ టెస్టులో తాను కెమెరాకు చిక్కిన వెంటనే, కోచ్ లీమన్ రిజర్వ్ ప్లేయర్ హ్యాండ్స్‌కాంబ్‌ను పంపి శాండ్‌పేపర్‌ను దాచిపెట్టాలని చెప్పారు. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్‌లోనూ నిజం చెప్పవద్దని ఒత్తిడి చేశారని, చివరకు తనను ఒక్కడినే బలిపశువును చేశారని బాన్‌క్రాఫ్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, శాండ్‌పేపర్ విషయం బౌలర్లకు తెలియదంటూ కమిన్స్ చేసిన వాదనను బాన్‌క్రాఫ్ట్ తప్పుబట్టారు. ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా ఏర్పాటు చేసిన స్వతంత్ర ఫోరమ్ విచారణకు హాజరై తన వాదన వినిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు బాన్‌క్రాఫ్ట్ ప్రకటించారు.

