కలం, నిర్మల్ : ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని (Indiramma Bima) జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవరావు ఆదేశించారు . బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన నిర్మల్ మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలైట్ల నిర్వహణ, గ్రామాల పారిశుధ్యానికి నిధులు కేటాయించకుండా పనులు ఎలా చేపట్టాలని అధికారులను ప్రశ్నించారు. దీనిపై అదనపు కలెక్టర్ స్పందిస్తూ సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో సుధాకర్, తహసీల్దార్ ప్రభాకర్, ఆత్మ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

