ఖేలో ఇండియా జూడో పోటీలకు కరీంనగర్ సిద్ధం

కలం, కరీంనగర్ బ్యూరో: ఖేలో ఇండియా 8వ ఎడిషన్‌లో(Khelo India 8th Edition) భాగంగా కరీంనగర్ వేదికగా జరగనున్న జాతీయ స్థాయి జూడో పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ పోటీలకు నగరవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.

జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) డా. జె. స్వామి, జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజినీర్లు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన ఖేలో ఇండియా లోగో, మస్కట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశంపై ప్రధానంగా చర్చించారు. అనంతరం కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆకర్షణీయమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఖేలో ఇండియా పోటీల సమాచారం విద్యార్థులు, యువత, క్రీడాభిమానులకు చేరేలా ప్రధాన ప్రాంతాల్లో ప్రచార సామగ్రిని ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భాగంగా బస్టాండ్ పరిసరాలు, ప్రధాన కూడళ్లు, ప్రజల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఖేలో ఇండియా మస్కట్ సెల్ఫీ పాయింట్లు, భారీ కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మార్గదర్శకత్వంలో జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ సమన్వయంతో ఈ పనులను వేగవంతం చేయాలని సూచించారు. జాతీయ స్థాయి ఖేలో ఇండియా జూడో పోటీలకు కరీంనగర్ వేదిక కావడం జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, పోటీల నిర్వహణలోనూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>