కలం, ఖమ్మం బ్యూరో: వాగులు, చెరువులు, కుంటల వద్దకు వెళ్లి ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియా వీడియోలు చేసే వారిపై కఠిన నిఘా పెట్టాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ (Collector Divakara TS) అధికారులను ఆదేశించారు. ఆక్వాన్ తుఫాను ప్రభావంతో ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రజలు ముఖ్యంగా యువత ప్రమాదకర ప్రాంతాల వైపు వెళ్లకుండా కట్టడి చేయాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు.
భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వాన్ తుఫాను ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల వైపు దారి మళ్లినందున జిల్లాపై ప్రత్యక్ష ప్రభావం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రీల్స్ (Reels) చేయడం కోసం ఉధృతంగా ప్రవహించే వాగులు, ప్రమాదకర ప్రాంతాలకు యువత వెళ్లకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా, మత్స్యకారులు ఎవరూ చెరువులు, కుంటలు, వాగుల వైపు చేపల వేటకు గానీ, ఈత కొట్టడానికి గానీ వెళ్లకూడదని మత్స్యశాఖ ద్వారా గట్టిగా హెచ్చరించాలని ఆదేశించారు.
యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి..
భారీ వర్షాల దృష్ట్యా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, సిబ్బంది ఎవరూ హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని, ఇప్పటికే మంజూరైన సెలవులు ఉంటే వాటిని తక్షణమే రద్దు చేసుకోవాలని స్పష్టం చేశారు. వరద నియంత్రణ ప్రొటోకాల్స్(Protocols)ను అందరూ విధిగా పాటించాలని, రోడ్లపై ఎక్కడైనా నీరు పొర్లుతున్నా, లోతట్టు వంతెనలు లేదా కల్వర్టులు నీట మునిగినా వెంటనే ఆయా మార్గాలను బ్లాక్ చేసి ట్రాఫిక్ నిలిపివేయాలని సూచించారు. స్థానిక తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
గాలివానలకు చెట్లు లేదా కొమ్మలు విద్యుత్ తీగలపై పడిపోతే వాటిని వెంటనే తొలగించేందుకు ఉడ్ కట్టర్లు, ట్రీ కట్టర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, విద్యుత్ లైన్ల పునరుద్ధరణకు విద్యుత్ శాఖ అధికారులు పూర్తి సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్ (Collector Divakara TS) తెలిపారు. పరిస్థితిని బట్టి అవసరమైన చోట సహాయక చర్యల కోసం ఈ నెల 21, 22 తేదీల్లో ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్టీఆర్ఎఫ్ (SDRF) బృందాలను అందుబాటులో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
డీఈఓకు సెలవులు ప్రకటించే అధికారం..
స్థానిక పరిస్థితులు, వర్షాల తీవ్రతను బట్టి పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే పూర్తి అధికారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), సంక్షేమ విద్యాసంస్థల అధికారులకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ అధికార యంత్రాంగానికి సహకరించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Also Read : పెద్దపల్లికి నాగ చైతన్య సీక్రెట్ టూర్
Follow Us On : WhatsApp

