ఈఎస్ఐ వసతుల కోసం ఏఐటీయూసీ గళం

కలం, కరీంనగర్ : రామగుండం (Ramagundam) పారిశ్రామిక ప్రాంతంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈరోజు ఎన్టీపీసీ ఈఎస్ఐ ఆసుపత్రి (ESI Hospital) ఎదుట ధర్నా నిర్వహించి, డాక్టర్ హిమబిందుకు వినతిపత్రం సమర్పించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని బసంత్‌నగర్, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ తదితర పరిశ్రమల్లో లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరి వేతనాల నుంచి ఈఎస్ఐ కోసం ప్రతినెలా లక్షలాది రూపాయలు కట్ చేస్తున్నప్పటికీ, ఈ ప్రాంతంలోని ఈఎస్ఐ డిస్పెన్సరీలో సరైన వైద్య సదుపాయాలు లేవని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఆసుపత్రి భవనం కూడా లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాంసాని శంకర్, అధ్యక్షుడు రెడ్డపాక లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎన్టీపీసీలో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీలో రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, డయాబెటిస్ పరీక్షలు, అవసరమైన మందులు అందుబాటులో లేవని విమర్శించారు. పేరుకు మాత్రమే డిస్పెన్సరీని నిర్వహిస్తూ, ఈఎస్ఐ పేరుతో కార్మికుల వేతనాల నుంచి డబ్బులు కట్ చేస్తున్నారని అన్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

కార్మికులు వైద్యం కోసం ఈఎస్ఐ ఆసుపత్రికి వస్తే హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారని తెలిపారు. అక్కడ వైద్యులు ఐదు రకాల మందులు రాస్తే, వాటిలో మూడు రకాల మందులను బయట మెడికల్ షాపుల్లో వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి లేకపోవడం కార్మికులకు శాపంగా మారిందన్నారు.

ప్రభుత్వం వెంటనే స్థలం కేటాయించి, యుద్ధప్రాతిపదికన వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించి, అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అసంఘటిత రంగ కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో టి. సత్యనారాయణ, ఆర్. రాజు, టి. నారాయణరెడ్డి, ఎం. రవి, ఈ. మల్లేష్, పి. సంతోష్, ఎండీ సత్తార్, జి. మైపాల్ రెడ్డి, కె. పోశం, అర్జున్, శ్యామ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>