కలం, జనగామ: తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఆరు గ్రామాల్లో వరుస దొంగతనాలకు (House Thefts) పాల్పడుతున్న ముగ్గురు యువకులను రఘునాథపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఐలేని అచ్యుత్రెడ్డి(19), కడుదుల అరవింద్(22), గుడెల్లి రంజిత్(18) స్నేహితులుగా ఉంటూ రాత్రివేళల్లో గ్రామాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ నెల 18న కోమళ్ల బోలెట్ వద్ద వాహన తనిఖీల సందర్భంగా అనుమానంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కుర్మగూడెం, భంజీపేట, శివాజీనగర్, రఘునాథపల్లి, కంచనపల్లి, ధర్మసాగర్ మండలం కరుణాపురంలో జరిగిన దొంగతనాల్లో వీరి ప్రమేయాన్ని గుర్తించారు.
నిందితుల నుంచి 113.150 గ్రాముల బంగారం(11.315 తులాలు), 2,309 గ్రాముల వెండి, హీరో గ్లామర్, హీరో ప్యాషన్ ప్రో, కేటీఎం డ్యూక్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ రూ.20.50 లక్షలుగా పోలీసులు వెల్లడించారు. వరంగల్ సీపీ ఆదేశాలతో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర పర్యవేక్షణలో కేసులను ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

