కలం, రామడుగు: బీజేపీ రామడుగు (Ramadugu BJP) మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి, తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యం ఐకేపీ సెంటర్లలో, ప్యాక్స్‌లో, కల్లాల దగ్గర పోసి నెల రోజులు గడుస్తున్న ధాన్యాన్ని కొనుగులు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్నారని ఆవేదన చేశారు. దళారులు, అధికారులు, ఎమ్మెల్యే అందరూ కలసి మద్దతు ధర రాకుండా రైతులను ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నారని ఆరోపించారు. సన్నలకు రూ. 500 బోనస్‌లు ఇవ్వాలని, వడ్ల కొనుగోళ్లను ప్రారంభించడం లేదని విమర్శించారు. రైతులకు బోనస్ ఇవ్వలేకనే ప్రభుత్వం తూకం మొదలుపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు శ్రీనివాస్, బండ తిరుపతి రెడ్డి, మహిళ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు మామిడిపెళ్లి చైతన్య, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు.

