కలం, మహబూబ్నగర్ బ్యూరో: రాజకీయ విభేదాల పేరుతో భారత ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను కించపరిచే వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భండారి శాంతికుమార్(Bhandari Shanthikumar) విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన భారత్ సమ్మిట్ వ్యాఖ్యలు, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ-ఎస్ఐఆర్పై మాట్లాడారు.
హైదరాబాద్లో నిర్వహించిన భారత్ సమ్మిట్లో అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేదన్నట్లు రాహుల్ గాంధీ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉందని, అయితే రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రజాస్వామ్య విశ్వసనీయతను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఇటలీ రాజకీయ నాయకుడు జియాకోమో ఫిలిబెక్ కాంగ్రెస్ రాజకీయ నినాదాన్ని సమ్మిట్ వేదికపై వినిపించినట్లు వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, భారత అంతర్గత రాజకీయాల్లో విదేశీ ప్రతినిధుల జోక్యాన్ని ప్రోత్సహించడం తగదన్నారు.
ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంబంధిత అధికారులకు సమర్పించిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. వీసా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపి, ఆధారాల మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వేదికగా జరిగే అంతర్జాతీయ సమావేశాలు రాష్ట్ర ప్రతిష్ఠను పెంచేందుకు, ప్రజలకు అవకాశాలను విస్తరించేందుకు ఉపయోగపడాలని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం, ఖచ్చితమైన ఓటరు జాబితాలను రూపొందించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని శాంతికుమార్ తెలిపారు. కొత్తగా అర్హత పొందినవారి పేర్లను చేర్చడం, మరణించినవారి వివరాలను తొలగించడం, నివాస మార్పులు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన పేర్లను నిబంధనల ప్రకారం పరిశీలించి సరిచేయడం అవసరమన్నారు. అర్హులైన ఏ పౌరుడి పేరూ అన్యాయంగా తొలగించకూడదని, అదే సమయంలో అనర్హ నమోదులను కొనసాగించకూడదని స్పష్టం చేశారు. ఓటరు జాబితా సవరణను ఏ మతానికో, వర్గానికో వ్యతిరేకమైన చర్యగా చిత్రీకరించడం సరికాదన్నారు. చట్టం నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగానే ఓటరు అర్హతను నిర్ణయించాలన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బాలరాజు, వీరబ్రహ్మ చారి, సుదర్శన్ రెడ్డి, నర్సింహులు, రాజు, రవీందర్ రెడ్డి, సత్యం, ప్రతాప్ రెడ్డి, నాగరాజు, ఆంజనేయులు, వేణు, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

