కలం యాదగిరిగుట్ట : భువనగిరి ( Bhuvanagiri) మున్సిపాలిటీ పరిధిలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అమ్మవారి కల్యాణ మహోత్సవానికి (Renuka Yellamma Kalyanam) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah) హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయానికి చేరుకున్న ప్రభుత్వ విప్‌కు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తుల జయజయధ్వానాలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన అమ్మవారి కల్యాణ వేడుకలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

