భారత్ సమ్మిట్ ప్రసంగంపై బీజేపీ ఫిర్యాదు

కలం, కరీంనగర్: హైదరాబాద్‌లో జరిగిన ‘భారత్ సమ్మిట్ 2026’లో(Bharat Summit 2026) పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ సెక్రటరీ జనరల్, విదేశీ రాజకీయ ప్రతినిధి జియాకోమో ఫిలిబెక్ (Giacomo Filibeck) చేసిన రాజకీయ ప్రసంగంపై బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విదేశీ ప్రతినిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

భారత్ సమ్మిట్‌లో ఇటలీకి చెందిన విదేశీ ప్రతినిధి జియాకోమో ఫిలిబెక్ ప్రసంగిస్తూ బహిరంగంగా “ఓట్ చోర్, గద్దీ చోద్” అనే రాజకీయ నినాదాన్ని లేవనెత్తి, దానిని ఆంగ్లంలో “Vote thief, leave your seat” అని అనువదించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత భూభాగంలో జరిగిన కార్యక్రమంలో విదేశీ రాజకీయ సంస్థకు చెందిన సీనియర్ బాధ్యుడు భారతదేశ అంతర్గత రాజకీయ చర్చల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

జియాకోమో ఫిలిబెక్ కాన్ఫరెన్స్ వీసా, బిజినెస్ వీసా, టూరిస్ట్ వీసా లేదా మరే ఇతర కేటగిరీ వీసాపై భారత్‌లోకి ప్రవేశించారో తేల్చాలని కోరారు. సమ్మిట్‌లో ఆయన చేపట్టిన రాజకీయ కార్యకలాపాలు సంబంధిత వీసా నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025’ కింద వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ చట్టాల ఉల్లంఘనపై విచారణ చేపట్టాలని కోరారు. ఈ కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించిన, కుట్ర పన్నిన లేదా సహకరించిన సదస్సు నిర్వాహకులు, స్పాన్సర్లు, సమన్వయకర్తలపై తగిన చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీపీని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు గుజ్జ శ్రీనివాసరావు, మాడ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, ఎర్రబెల్లి సంపత్ రావు, నరసింహ రాజు, కోల అశోక్, బీజేపీ కిసాన్ మోర్చా, బీజేవైఎం, ఎస్టీ, మైనార్టీ మోర్చా అధ్యక్షులు మోతే గంగారెడ్డి, సంఘ నరేష్, రమావత్ శ్రీనివాస్ నాయక్, సమీ పర్వేజ్, సోషల్ మీడియా కన్వీనర్ వినోద్ తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>