కలం, తిమ్మాపూర్ : పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని (Indiramma Life Insurance) ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతోందని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ( MLA Kavvampalli Satyanarayana) తెలిపారు. ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని వెల్లడించారు.
మంగళవారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని సాయిరాం గార్డెన్స్‌లో చేయూత పథకం కింద కొత్తగా ఎంపికైన మండల లబ్ధిదారులకు ఎమ్మెల్యే మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో త్వరలోనే పెన్షన్ నగదు జమ కానుందని, ప్రస్తుతం మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నిరుపేదలు, నిస్సహాయులకు ఆసరాగా నిలిచేలా కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఒకవైపు చేయూత కింద కొత్త పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుండగా, మరోవైపు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకొస్తోందన్నారు.
కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఈ పథకం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. సాధారణంగా జీవిత బీమా పథకాలు వ్యక్తిగతంగా లేదా నిర్దిష్ట వర్గాలకే పరిమితమవుతాయని, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా మాత్రం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిందని ఎమ్మెల్యే వివరించారు. గత బీఆర్ఎస్ పాలకులు పదేళ్ల పాలనలో పేదల సంక్షేమాన్ని విస్మరించారని ఎమ్మెల్యే విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చి పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందకుండా చేశారని ఆరోపించారు.
పదేళ్లలో అర్హులకు రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించలేకపోయారని, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఈ కారణంగానే ప్రజలు బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించారని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వంటి ఎన్నికల హామీల్లో లేని ప్రజోపయోగ కార్యక్రమాలను సైతం ప్రభుత్వం చేపడుతోందని పేర్కొన్నారు.
కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గోదారి శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, గన్నేరువరం ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, నుస్తులాపూర్, పోరండ్ల, ఊటూరు పీఏసీఎస్ చైర్మన్లు మోరపల్లి రమణారెడ్డి, గోపు తిరుపతిరెడ్డి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, ప్యాక్స్ వైస్ చైర్మన్ రావుల కృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ చెన్నబోయిన రవి, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్, తుమ్మనపల్లి సంధ్య, పొన్నాల సంపత్, పెరుక రవీందర్, పార్టీ మామిడి అనిల్ కుమార్, బుధారపు శ్రీనివాస్, నోముల అనిల్ కుమార్, గొట్టెముక్కుల సంపత్ రెడ్డి, రాములు యాదవ్, శ్రీనివాస్, రెడ్డిగాని రాజు, ఎలుక రాజు తోపాటు వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ గ్రామశాఖల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

