గురుకులంలో దారుణం .. 20 మంది విద్యార్థినులపై వంటమనిషి వేధింపుల ఆరోపణలు!

‎కలం, ఆలేరు : విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన గురుకుల పాఠశాల కీచకులకు అడ్డాగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మంగమ్మగూడెం వద్ద గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో (Gurukul School) దారుణం వెలుగుచూసింది. పాఠశాలలో పనిచేస్తున్న ఓ వంటమనిషి గత కొంతకాలంగా సుమారు 20 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు (Sexual Harassment) పాల్పడుతున్న ఘటన కలకలం రేపింది.

పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తున్న వ్యక్తి, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ (బ్యాడ్ టచ్) వేధింపులకు గురిచేస్తున్నాడు. “రూ. 500, రూ. 1000 ఇస్తాను.. వస్తారా?” అంటూ అమాయక విద్యార్థినులను ప్రలోభపెడుతూ లైంగికంగా వేధించాడు. ఇలా సుమారు 20 మంది బాలికలు అతడి వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది. ఈ దారుణంపై బాధిత విద్యార్థినులు పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీరాణికి ఫిర్యాదు చేశారు. అయితే, నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రిన్సిపాల్, పాఠశాల పరువు పోతుందనే ఉద్దేశంతో విషయాన్ని బయటకు పొక్కకుండా విద్యార్థినులనే బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వేధింపులు భరించలేక బాధిత విద్యార్థినులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం తల్లిదండ్రులకు తెలిసిందని గ్రహించిన ప్రిన్సిపాల్, నిందితుడైన వంటమనిషిని గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి పంపించివేయడంతో అతడు పరారయ్యాడు. ఉద్రిక్తత నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరోవైపు, ఈ ఘటనపై వార్తల సేకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులను పాఠశాల లోపలికి వెళ్లకుండా ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి అడ్డుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు, విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసిన ప్రిన్సిపాల్‌పై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>