కలం, తెలంగాణ బ్యూరో: రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం గత ప్రభుత్వంలో ‘రైతుబంధు’ పేరుతో మొదలైన పథకం ఇప్పుడు ‘రైతుభరోసా’ (Rythu Bharosa) పేరుతో అమలవుతున్నది. ఈ స్కీమ్‌లో మొదటి నుంచీ సరైన పద్ధతి అనుసరించలేదని, ఫలితంగా ప్రజా ధనం దుర్వినియోగమవుతున్నదని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ పథకం కింద లబ్ధిపొందుతున్నవారిలో దాదాపు 20.5% మంది సంపన్న రైతులు, భూస్వాములు, ఎక్కువ సాగుభూమి ఉన్నవారేనని తేలింది.
వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనమే లేదని పేర్కొన్నది. మరోవైపు పేదలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ‘ఆసరా’ పేరుతో మొదలుపెట్టిన స్కీమ్ ప్రస్తుతం ‘చేయూత’ పేరుతో కొనసాగిస్తున్నా లబ్ధిదారుల్లో దాదాపు 16% మంది చనిపోయినవారే ఉన్నట్లు ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఈ రెండు స్కీమ్‌ల కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.17,025 కోట్ల మేర ప్రజాధనం పంపిణీ అయింది. పేదలను ఆర్థికంగా ఆదుకోవాలన్నది ప్రభుత్వాల ఉద్దేశం అయినప్పటికీ కొన్ని లోపాలు, పొరపాట్లు, విధాన నిర్ణయాల్లోని అంశాల కారణంగా దుర్వినియోగం అవుతున్నాయని ఆ అధ్యయనాన్ని ఆధారం చేసుకుని ‘సెస్’ ఇటీవల రూపొందించిన తన నివేదికలో ప్రస్తావించింది.
రూ.86వేల కోట్లు పంపిణీ
సాగు సీజన్ పనులు మొదలయ్యేటప్పుడు రైతులకు పంటలకు పెట్టుబడి సాయంగా ‘రైతుభరోసా’ (Rythu Bharosa) పేరుతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నది. గత ప్రభుత్వంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్ ప్రారంభమైంది మొదలు 2024-25 వరకు మొత్తం 86,028 కోట్ల ప్రజాధనం పంపిణీ అయిందని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. పంట ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలన్నదే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశమని, సొంత సాగుభూములు ఉన్న రైతులకు ఏటా రెండు సీజన్లకు అందిస్తున్నదని పేర్కొన్నది.
20.5% మంది భూస్వాములు
రైతు భరోసా పథకం దుర్వినియోగమవుతున్నదని, కష్టపడి సాగుచేస్తున్న రైతులకు ఈ స్కీమ్‌లో భాగస్వాములుగా లేరని అధ్యయనం స్పష్టం చేసింది. సొంత భూమి ఉండి సాగు పనుల్లో లేని చాలామంది రైతులకు ఈ స్కీమ్ పేరుతో సాయం అందుతూ ఉన్నదని వివరించింది. కౌలు రైతులు సేద్యం చేస్తున్నా ఈ స్కీమ్ వారికి ఏ విధంగానూ ఉపయోగపడడంలేదన్నది. గరిష్ట సాగుభూమి ‘సీలింగ్’ లేకపోవడంతో ఎక్కువ భూమి ఉన్న సంపన్న రైతులు, భూస్వాములకు భారీగా లబ్ధి కలుగుతున్నదని వివరించింది. సాగుపనులే చేయకుండా రైతుభరోసా పేరుతో లబ్ధి పొందుతున్నవారు దాదాపు 20.5% మేర ఉన్నట్లు తేల్చింది.
‘చేయూత’ లబ్ధిదారుల్లో మృతుల పేర్లు
పేదలకు ఆర్థికంగా, సామాజికంగా భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ‘ఆసరా’ పేరుతో పింఛన్లను పంపిణీ చేస్తున్నా విధానపరమైన లోపాలతో ప్రజాధనం దుర్వినియోగమవుతున్నదని ఆ అధ్యయనం వెల్లడించింది. వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీతన్నలు.. వీరికి ప్రతి నెలా వెయ్యి రూపాయల చొప్పున 2019 వరకూ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. దివ్యాంగులకు నెలకు రూ.1,500 చొప్పున ఇచ్చింది.
ఆ తర్వాత ఇది రూ.2,016 చొప్పున ఇస్తూ దివ్యాంగులకు రూ.3,016 చేసింది. దీని అమలుపై ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) 2018-19 నుంచి 2020-21 మధ్యకాలంలోని గణాంకాలను విశ్లేషించి దాదాపు 16% మంది లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులు కారని తేల్చింది. కొంతమంది ఈ పథకం నిబంధనల్లో రూపొందించిన గరిష్ట విస్తీర్ణానికి మించి సొంత భూములు ఉన్నట్లు వెల్లడైంది. ప్రభుత్వం దగ్గర ఉన్న లబ్ధిదారుల జాబితాలో కొందరికి ఫోర్-వీలర్లు కూడా ఉన్నట్లు తేలింది. ఈ పథకానికి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2024-25 వరకు రూ.64,501 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేసింది.

