కలం, హనుమకొండ: విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని అందిస్తాయని ఐజీ గజారావు భూపాల్ (IG Gajarao Bhupal) అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 (క్లస్టర్–డి) (Telangana Police Games) మంగళవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. ఐజీ గజారావు భూపాల్, పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. క్రీడలు క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు విధి నిర్వహణలో ఎదురయ్యే పని ఒత్తిడిని అధిగమించేందుకు దోహదపడతాయన్నారు. విధులతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తున్న పోలీసు సిబ్బందిని అభినందించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. హనుమకొండ (Hanamkonda)లో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేసిన పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతతోపాటు నిర్వాహక అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, కిట్స్ కళాశాల, భీమారంలోని ఎస్వీఎస్ కళాశాల మైదానాల్లో వివిధ క్రీడా పోటీలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ యూనిట్లకు చెందిన సుమారు 1,458 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అడిషనల్ డీసీపీలు రాయల ప్రభాకర్ రావు, బాలస్వామి, ఏసీపీలు, ఏఆర్ అదనపు డీసీపీలు, పోలీసు అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.

